శ్రీకృష్ణ నిర్యాణం - శ్రీ విష్ణు పురాణము

 శ్రీకృష్ణ నిర్యాణం - శ్రీ విష్ణు పురాణము

 జగద్రక్షణ కోసం శ్రీకృష్ణుడు బలరాముని తోడ్పాటుతో దుష్టరాజులను - దుష్టదైత్యులను సంహరించాడు. అర్జునుని సహకారంతో సర్వ అక్షౌహిణీ సేనలను నాశనం చేసి భూభారాన్ని కూడా దించేశాడు. ఈ కార్యక్రమాలన్నీ ముగించిన కృష్ణుడు, ఇక యాదవ కులాన్ని 'విప్రశాపం' అనే నెపం చేత ఉపసంహరింపచేశాడు. కేవలం అదొక మిష. నిజానికి కావలసిన కార్యములన్నీ పూర్తయిపోయాయి. ద్వారకను వదలి, మానుషరూపం వదిలిపెట్టి, తన విష్ణులోకం చేరుకున్నాడు.

మైత్రేయుని కోరికమేరకు, యాదవకులాన్ని కృష్ణుడు ఉపసంహరించిన రీతిని పరాశరుడిలా చెప్పసాగాడు....

విశ్వామిత్ర కణ్వ నారదమునులు పిండారక తీర్థంలో యదుకుమారులకు కనిపించారు. ఆ యువ యాదవులు, కాగల కార్యవిధిప్రేరణ వల్ల జాంబవతీ సుతుడైన సాంబునికి స్త్రీవేషం వేసి, ఆ మహర్షులను ఆటపట్టించబోయారు. అది వంశమంతటికీ చేటు తెస్తుందని వారికి తెలియదాక్షణాన.

సాంబుని మహర్షుల ఎదుట వినయంగా నిల్పి, "ఈ ఇంతికి పుత్రుడుదయించునా?" అని వేళాకోళంగా ప్రశ్నించారు. మహర్షులతో ఆటలా?!....దివ్యదృష్టిచేత ఆ మహర్షులు సర్వమూ గ్రహించి, ఆగ్రహించి "ఓరోరి! యాదవకుల వినాశకులారా! అతిలోక ప్రభావం చేత ఈ (మాయ) స్త్రీకి ముసలం పుడుతుంది. అదే మీ సంహార కారణమవుతుంది. ఇకపొండి" అని పలికారు.

వారంతా కలిసి, తాము చేసిన కొంటెపనినీ - అందుకు మహర్షులిచ్చిన శాపాన్నీ ఉగ్రసేన మహారాజుకు నివేదించారు. సాంబుని కడుపున ముసలం పుట్టడంతో ఉగ్రసేనుడా రోకలిని పూర్తిగా పొడికొట్టించాడు లేక అరగదీయించాడు. చాలా చిన్న తునక మిగిలిపోగా, దాన్నీ సముద్రంలో పారేశారు. ఆ ముక్కను ఒక చేపతిన్నది. ఆ చేప జాలరుల వలలో పడటంతో దాన్ని ఒకడు చంపి, తన బాణానికి ములికగా ఆ చేప పొట్టలో దొరికిన ముసలం అవశేషాన్ని అమర్చుకున్నాడు. అతడిపేరు - జరసుడు. బోయవాడు. కృష్ణరూపుడు శ్రీహరికి ఇదంతా తెలుసు!

ఒకరోజు దేవతలచేత పంపబడిన వాయుదేవుడు, శ్రీకృష్ణమూర్తిని ఏకాంతంలో కలుసుకుని "దేవతలచే ప్రేరేపించబడిన తాము దుష్టశిక్షణార్థము అవతరించిన నారాయణులని, ఇంద్రుడు ఒకసారి గుర్తుచేసి రమ్మన్నందున దూతగా వచ్చాను" అని చెప్పగా, శ్రీకృష్ణుడు చిర్నవ్వుతో "దేవదూతా! యాదవులు తెగపెరిగారు. అకృత్యాలు మరిగారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, మూర్ఖత్వం, స్వార్థం అన్నీ పెరిగాయి వీళ్ళలో. ఒకనాటి యాదవుల సల్లక్షణాలు లేని తరం కొనసాగుతోందిప్పుడు. భూమికి భారంగా పరిణమించారు.

(భూవోనా ద్యాపి భారోయం యాదవై ర నిబర్హితైః (5-37-23))

కనుక, నేనూ అవతార పరిసమాప్తి చేయక తప్పదు. ఈ భూభారాన్ని దింపి ఏడు రాత్రులలో దీన్ని నిర్వర్తించి వస్తాను" అని చెప్పాడు. దుశ్శకునాలు చూసి ఉద్ధవుడు అక్కడకు రాగా "నా అనుగ్రహం వల్ల నువ్వు సిద్ధిపొందగలవు. బదరికాశ్రమానికి వెళ్లు! నేను భక్తుల హితాన్ని కోరి, ద్వారకలో నా నివాసంలో ఉంటాను. అది తప్ప మిగిలిన ద్వారక అంతా సముద్రంలో కొట్టుకుపోగలదు. నువ్వు చూసిన శకునాలకు ఫలితం - త్వరలో యాదవకులనాశనము తప్ప ఇంకొకటి కాదు" - అన్నాడు శ్రీకృష్ణుడు.

ఆ తర్వాత యాదవులంతా బలరామకృష్ణులతో కూడి ప్రభాస తీర్థానికి వెళ్లారు. కుకుర, అంధక, వృష్టి తెగల యాదవులంతా భగవత్‌ ప్రేరణచేత బాగా మద్యం సేవించారు.

త్రాగిన తదుపరి ప్రేలాపనలు అధికమై వాక్కులహంగా పరిణమించి అది ఆయుధాల వరకూ వెళ్లింది. ఆయుధ ప్రయోగానికి మత్తు సహకరించక పోవడంతో,దాపున ఉన్నదీ, ఏపుగా పెరిగినదీ అయిన తుంగ లేక ఱెల్లుపొదలు పీకి కొట్టుకోసాగారు. అది ఒకప్పుడు సాంబుని కడుపున పుట్టిన ముసలాన్ని చూర్ణంచేసి సముద్రంలో కలుపగా ఒడ్డుకు కొట్టుకొచ్చి పెరిగిన తుంగగడ్డి. పేరుకు అది 'గడ్డి' కాని, ఒక్కొక్క ఱెల్లుదుబ్బ లోహముసలంతో సమానంగా ప్రభావం చూపించి, శ్రీకృష్ణుడు - దారుకుడు తప్ప మిగిలిన వారంతా ఆ అకారణ యుద్ధకలహంలో హతులైనారు.

అదంతా చూస్తున్న బలరాముడు, ఆర్ఝ్యం ఇస్తూ సముద్రజలాల్లోనికి వెళ్లి ఆదిశేషుని అంశగా మారి, నాగులు అర్చిస్తూండగా అవతార పరిసమాప్తి చేశాడు. "జరిగిందంతా చూశావు కదా! దారుకుడా! నువ్వు అర్జునుని వద్దకు వెళ్ళి నా భార్యావర్గాన్ని కాపాడవలసిందని చెప్పు! ఈ ద్వారకాపురి కూడ ఏడురోజుల్లో మునిగిపోనున్నది. నేను యోగసమాధి చెంది ఈ కళేబరాన్ని విడువనున్నాను" - అని పలికాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణ నిర్యాణం

దారుకుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ పాలించడానికి ఉగ్రసేనుడివద్దకు వెళ్ళాడు. ఒకప్పుడు దూర్వాస మహర్షి చెప్పిన రీతిగా తన పాదాన్ని మోకాలి మీద ఉంచి యోగ సమాధిలోనికి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు.

సరిగ్గా ఆ సమయానికే బోయవాడు జరసుడు, ఆనాడు తాను సంపాదించిన ములికిని జతచేసిన బాణాన్ని సంధించగా, అది మృగానికి తగలక శ్రీకృష్ణుని కాలి బొటనవ్రేలిని తాకింది. దగ్గరకొచ్చి చూసేసరికి - ఆ బోయవాడి పుణ్యం వల్ల శ్రీహరి వైకుంఠగతుడవుతూ కనిపించాడు. ఆశ్చర్యపోయి తన తప్పిదాన్ని మన్నించమన్నాడా జరసుడు.

"నువ్వు చింతించ వద్దు! ఇది ఏ రీతిగా జరగాలో అలాగే జరిగింది. ఇందులో నీ ప్రమేయమేమీ లేదు" అని ఉరడించి, ఆ బోయవాడికి స్వర్గవాసం అనుగ్రహించాడు. ఆ విధంగా తన మానుషరూపాన్ని ఉపసంహరించుకున్నాడు శ్రీహరి.

అర్జునుడి కీ వార్త చేరింది. బలరామకృష్ణుల పార్థివదేహాలకు సంస్కారాన్ని చేయించి, అక్కడ ఒకర్నొకరు చంపుకున్న యాదవులందరినీచూచి, వారికి తగిన రీతిన కర్మకాండ జరిపించాడు పార్థుడు.

రేవతి, కృష్ణసతులైన అష్టమహిషులు కృష్ణుని వెంట, ఆ చితిపైనే సహగమనం చేశారు. ఉగ్రసేనాదులూ కృష్ణుడులేని భౌతికప్రపంచంలో ఉండలేక తనువు చాలించేశారు.

అందరికీ ప్రేతకృత్యాలు నిర్వర్తించి, అర్జునుడు మిగిలిన జనాన్ని వజ్రుడు వెంటరాగా ద్వారక నుంచి తరలించసాగాడు. పదహారువేలమంది గోపికలను (శ్రీకృష్ణసతులను) వెంటబెట్టుకుని రక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు పార్థుడు. వారందరికీ పంచనదం అనే చోట వసతి ఏర్పరచాడు.

No comments:

Post a Comment