సదాచారోల్లంఘనం - శ్రీ విష్ణు పురాణము

సదాచారోల్లంఘనం-శ్రీ విష్ణు పురాణము

మానుషలోకంలో ప్రవర్తిల్లిన సకల వర్ణాశ్రమధర్మాలకూ వేదాల్లో మూలాలున్నాయి. శ్రుతుల చేత ప్రతిపాదించబడిన ధర్మశాసనాలను నిందించినా, వెక్కిరించినా, వేదాలను దూషించినా, విమర్శించినా, కుతర్కాలు లేవదీసినా అట్టివారిని నగ్నులంటారు. వీరు అజ్ఞానులలో కెల్లా అథములు.

ఒకప్పుడు దేవతలకు - రాక్షసులకు జరిగిన యుద్ధంలో హ్రాదుడు దేవతలను ఓడించి స్వర్గాన్నుంచి వారిని తరిమేయగా, వారంతా శ్రీహరిని స్తుతించారు. దేవతలు సోత్రం చేయగా, క్షీరసముద్ర ఉత్తరతీరాన విడిసివున్న విబుధులందరికీ అభయమిచ్చేందుకు గరుడ వాహనారూఢుడై - శంఖ చక్రగదా పద్మధారియై విష్ణుభగవానుడే తెంచాడు. చిర్నవ్వుతో వారివంక చూసిన శ్రీహరితో దేవతలంతా ఇలా మొరపెట్టుకున్నారు....

"ప్రభూ! నీ శరణు కోరిన మమ్ములను రాక్షసుల బారినుండి కాపాడి రక్షించు! పరమపురుషా! బ్రహ్మ ఆనతిని అతిక్రమించి హ్రాదునివంటి రాక్షసులు యజ్ఞాల్లో మాకు హరిర్భాగాలు అందకుండా చేస్తున్నారు. మేమంతా నీ అంశగలవారమే అయినప్పటికీ, జగత్తును మా అజ్ఞానం చేత వేరేగా చూస్తున్నాము. వేదమార్గాన్ని అనుసరిస్తూ - తపోబలంచేత విర్రవీగుతూ శత్రువులైన రాక్షసులు మాకు దుర్నిరీక్ష్యులైనారు. వారిని మట్టుబట్టడం మాకు శక్యంగావడం లేదు. సర్వాత్మకుడైన ఓ విష్ణుభగవానుడా! ఈ దనుజుల్ని సంహరించే మార్గం మాకు ఆనతీయవలసింది" అని వినతి చేశారు.

అప్పుడా శ్రీహరి, తన దేహం నుంచి మాయా మోహుని జనింపజేసి, దేవతల పరం చేసి "అమరులారా! వీడు మాయామోహుడు. దైత్యులందరినీ ప్రలోభపెట్టగలవాడు. నాకూ, బ్రహ్మయొక్క అధికారానికీ వినాశం తలపెట్టె దానవులెంత మందినైనా వధించగలడు. భయపడకండి" అని చెప్పాడు. భగవంతుని ఆజ్ఞమేరకు మాయామోహుడు దేవతలు దారి చూపుతూండగా, రాక్షసుడున్న తావునకు వెళ్ళాడు.

మైత్రేయా! అప్పుడా మాయా మోహుడు, నర్మదానదీ తీరానికి వెళ్లి తపమాచరించేందుకు ఆసక్తిగా ఉన్న మహారాక్షసులని చూశాడు. మాయామోహుడు మాయదేహధారి కూడా కాగలడు. వెంటనే తన దేహాన్ని దిగంబరంగా చేసుకుని, తలపై నున్నగా (బోడి) గుండు చేసుకుని నెమలి ఈకలను చేబూని వారివద్దకు వెళ్లి ఇలా అన్నాడు.

"దైత్యులారా! మీరీతపస్సు ఇహలోక సౌఖ్యాలకా? పరలోక సౌఖ్యాలకా? దేనికోసం చేస్తున్నారు?" అని అడిగాడు.

"ఓ బుద్ధిమంతుడా! పరలోకం నిమిత్తమే మా ఈ తపమాచరించ బడుతోంది" అన్నారు వాళ్ళు. అప్పుడా మాయామోహుడు -

శ్లో|| కురుధ్వం మమ వాక్యాది యది ముక్తి మభీప్సథ |
అర్హధ్వ మే తం ధర్మంచ ముక్తి ద్వార మ సంయుతమ్‌ ||

"మీరు మోక్షమే కోరినట్లయితే, నా పలుకులు శ్రద్ధగావిని, ఆ ప్రకారం ఆచరించండి! మీకొరకు తెరవబడే ముక్తిద్వారం నిమిత్తం నేను వచించబోయే ధర్మం బాగా ఉపకరిస్తుంది. ఇంతకంటే శ్రష్ఠమైంది లేదు. ఈ ధర్మం ఆచరిస్తూంటే, మీకు స్వర్గం - దానికంటే ఉత్తమమైన మోక్షం లభించగలదు..." అంటూ వేద దూరమైన కర్మలు ఉపదేశించాడు.

ఆ మాయచేత మోహితులైన దానవులందరికీ, ఆ దిగంబరుని మాటలు బాగా రుచించాయి. వివిధ యుక్తి ప్రదర్శన - శుష్కతర్కచర్చల ఫలితంగా రాక్షసుల్ని వేదమార్గం నుంచి మరలించడంలో కృతకృత్యుడయ్యాడా మాయామోహుడు.

"ఇది అర్హత మతము" అని చెప్పి, ఎర్రని వస్త్రములు ధరించి, ఇంద్రియనిగ్రహం గల మాయామోహుడు వారందరిచేత వేదత్రయ ధర్మాలను త్యాగం చేయించాడు.



మోక్షం కోసం పశువుల్ని చంపడం హింస అనిపించుకుంటుందంటూ అహింసా సిద్ధాంతం అనే పేరిట యజ్ఞయాగాదులను మానిపించాడు. జగత్తంతా ఆధారశూన్యమనీ - అనురాగ మమకారాలు, సంసారంలో పడిమోహంలో కొట్టుకొనేలా చేస్తున్నాయనీ - నిజధర్మాల్ని రాక్షసులు విడిచిపెట్టేలా చేశాడు.

నానావిధాల ఈ బోధలు తలకెక్కి, మాయామోహితుడు చూపించిన దృష్టాంతాలతో మరింత చెలరేగి దానవులంతా క్రమక్రమంగా (ఒకర్ని చూసి ఒకరు, ఒకరి వల్ల విని మరొకరు) శ్రుతి - స్మృతి - బోధితధర్మాలను వదిలేశారు. లోకాయత, చార్వాక వేదబాహ్యమతాలను బోధించి వారందర్నీ ధర్మవిముఖులుగా మార్చడం మాత్రమే గాక వేదనిందకులుగా చేశాడు.

అత్యంత త్వరితంగా వారందరూ వేదనింద - బ్రాహ్మణ నింద మొదలైన ఘోరపాపాల పాల్ప్డటమే కాగ, శుష్కవాదాలు చేయడం ప్రారంభించారు.

"అగ్నిచేత దగ్ధములైన హవిస్సుల ఫల దాయకమా? ఇది అసలు నమ్మదగిన మాటేనా? ఎన్నెన్నో యజ్ఞాలు చేసినందువల్ల ఇంద్రపదవిని పొందిన ఇంద్రుడు, మనం చేసే హోమంలోని పుల్లా - పుడకా కర్రా - కంపా తినడం ఏం బాగుంది? అంతకంటే ఆకులలములు మేసేమేకలు నయంకాదూ? యజ్ఞంకోసం వధించబడే పశువుకు స్వర్గలోకప్రాప్తి అనేది నిజమే అయితే - దానికి బదులుగా యాగకర్త తన తండ్రినే బలిపశువుగా చేసి యాగంలో అతనికి ముక్తి ప్రసాదిస్తే మరింత యుక్తి యుక్తంగా ఉంటుంది కదా!

ఇహలోకంలో ఒకడు భుజించిన అన్నంవల్ల ఎక్కడో అంతరిక్షానికి అవతల ఉన్న పితృదేవుళ్ళు తరిస్తారంటూ శ్రాద్ధాదులు పెట్టే ఈ వేదాచారపరాయణులు పిచ్చివారిలా ఉన్నారే! ఇవన్నీ కేవలం ఈ ప్రాకృతజనుల నమ్మకాలు. అంతే ఇలా శుష్కతర్కాలతో రాక్షసులంతా ఒకర్నొకరు సమాధానపచుకుని మాయామోహుని బోధలు బాగా తలకెక్కించుకున్నారు. ఇల్లాంటి ఆచారవ్యవహారాత్మక కర్మకాండపట్ల ఉదాశీనత వహించడం ప్రారంభించారు.

మాయామోహుడు ఇంకొక దృష్టాంతం కూడా వారికి నచ్చేల చెప్పడంలో కృతకృత్యుడయ్యాడు. "వేదాలు అపౌరుషేయాలన్నారు. సరే! అలాగే అనుకుందాం! అవి ఆప్తవాక్యాలన్నారు. ఆప్తవాక్యాలనేవి ఆకాశం నుంచి వాటంతట అవే భూమ్మీద పడతాయా? దగ్గరగా వచ్చి ఆత్మీయంగా చెప్పే నాబోటి వారి వల్ల మీకు అందేవే అప్తవాక్యాలు అవుతాయి" అంటు నమ్మబలికాడు. ఏది చెప్పినా యుక్తియుక్తంగా ఉండాలి గాని, అతిశయోక్తులుగా ఉండరాదన్నాడు.

మాయామోహుని ప్రభావం దానవులంతా వేదాలపట్ల కక్షను నిర్లక్ష్యభావాన్ని పెంచుకున్నారు. దాంతో అధర్మం పెచ్చరిల్లింది. ఎప్పుడైతే వారు వేద దూరులైనారో క్రమక్రమంగా వారి బల శౌర్యవీర్య తేజ శ్శక్తులన్నీ హరించుకుపో నారంభించాయి.

అ అదనుకనిపెట్టి, దేవతలు రాక్షసులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ పెనుప్రయత్నంలో ధర్మమే రక్షించబడింది. సన్మార్గ విరోధము చేత దానవులంతా హతులయ్యారు. ఆ దానవులకు అంతకుపూర్వం స్వధర్మాచరణమే రక్షాకవచంగా ఉండేది. విష్ణుప్రేరేపిత విష్ణ్వాంశ నగ్నుడు, ముండితశిరస్కుడు మాయామోహితుని బోధనలు, దానవుల ధర్మనిరతికి నష్టం కలిగించడమే లక్ష్యంగా సాగడంతో వారు అసమర్థులైనారు.

మైత్రేయా! ఆ(నగ్న) మార్గగాములంతా వేదమనే కవచాన్ని వీడినవారై దేవతలచేత ఓడింపబడ్డారు. నానావిధాలుగా వేదనింద చేసినందుకు ఫలితం అనుభవించారు.

బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, పరివ్రాజాశ్రమం అని నాలుగే విధాలున్నాయి. అయిదవదనేది లేనేలేదు. గృహస్థాశ్రమాన్ని వీడితేగాని వానవ్రస్థాశ్రం లేదా పరివ్రాజాశ్రమం సిద్ధించదు. నగ్నధర్మావలంబనం పాపహేతువు.

శక్తి ఉండీ ఒక్కరోజు కర్మలోపం జరిపినా, అదిపాపహేతువే! ప్రాయశ్చిత్తంతో అతడు పరిశుద్ధుడు కాగల్గుతాడు. సూర్యుని దర్శించడం ద్వారా కొంతపాపప్రక్షాళన జరుగుతుంది. ఆరాధన వల్ల మరికొంత పాపం తొలగుతుంది. ఎవరి ఇల్లు దేవశూన్యమో, వానికి నిష్కృతి లేదు. అతడితో కలిసి సంచరించినా పాపమే!

బ్రాహ్మణాది 4 వర్ణాలవారు స్వధర్మాన్ని విడిచి హీనకర్మలు ఆచరిస్తే వారు నగ్నులనబడతారు. పంచమహాయజ్ఞాలు (ఋషి, దేవ, పితృ, అతిథి, భూతములను సంతృప్తిపరచుట) ఆచరించని వానితో మాట్లాడటమూ నరకహేతువే! కనుక ప్రాజ్ఞుడు నగ్నులను దూరం ఉంచాలి. వారిచే చూడబడిన శ్రాద్ధం అయినా పితృదేవతలకు ప్రీతి కరంకాదు.

No comments:

Post a Comment